NRI: 30 రోజుల్లోగా ఎన్ఆర్ఐ పురుషుల వివాహ రిజిస్ట్రేషన్ జరగాలి.. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు!
- పాస్‌పోర్టు సీజ్ లేదంటే రద్దు అవుతుంది
- ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం
- బిల్లు పాసయ్యే అవకాశాలు తక్కువ
ఎన్ఆర్ఐ వివాహాల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు రాజ్యసభలో నేడు ఓ బిల్లును ప్రవేశపెట్టారు. 30 రోజుల్లోగా ఎన్ఆర్ఐ పురుషులు తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేలా ఈ బిల్లును తీసుకొచ్చారు. 30 రోజుల్లోగా వివాహాన్ని రిజిస్టర్ చేసుకోకుంటే వారి పాస్‌పోర్టును సీజ్ చేయడమో, లేదంటే రద్దు చేయడమో జరుగుతుంది.
‘రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ బిల్, 2019’ కింద ప్రయాణ పత్రాలు, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకునే అవకాశముంది. అంతేకాకుండా రిజిస్టర్ చేసుకోని వారిని నేరస్థులుగా పరిగణించడమే కాకుండా వారికి సంబంధించిన స్థిర, చర ఆస్తులను కోర్టులు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ముగియనుండటంతో ఈ బిల్లు పాసయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.