Congress: ప్రియాంక యూపీ ర్యాలీ ఫొటోలంటూ తెలంగాణ ఫొటోలను పోస్టు చేసిన కాంగ్రెస్.. తీవ్ర విమర్శలతో తొలగింపు!
- లక్నోలో ప్రియాంక రోడ్‌షో
- వెల్లువెత్తిన కాంగ్రెస్ శ్రేణులు
- ఫొటోలను తప్పుగా పోస్టు చేసి విమర్శల పాలైన ప్రియాంక చతుర్వేది
తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించిన రోడ్‌షోకు అనూహ్య స్పందన లభించింది. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులుతీరిన జనం ప్రియాంకకు సాదర స్వాగతం పలికారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తల హడావుడి అంతా ఇంతా కాదు. ప్రియాంక దృష్టిలో పడేందుకు వారు నానా హంగామా చేశారు. పూలు, దండలు ఆమెపైకి విసురుతూ ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ప్రియాంక పర్యటన బహ్మాండమైన విజయం సాధించడంతో యూపీ కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, ఉత్సాహంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది చేసిన పొరపాటుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక ర్యాలీలో వెల్లువెత్తిన అభిమానం అంటూ సోషల్ మీడియాలో ఆమె కొన్ని పొటోలను పోస్టు చేశారు. అయితే, ఈ ఫొటోల్లో రెండు నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఫొటో కూడా ఉండడంతో ఆమె విమర్శల పాలయ్యారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె తన ట్వీట్‌ను డిలీట్ చేసి ఆ ఫొటోను తొలగించారు.