Himachal Pradesh: సహనం కోల్పోయిన హిమాచల్ ప్రదేశ్ సీఎం.. కాంగ్రెస్ నేతపై అసెంబ్లీలో మండిపాటు
- ఓ పథకం గురించి మాట్లాడుతుండగా అడ్డుతగిలిన కాంగ్రెస్ సభ్యుడు
- తమ హయాంలోనే ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చామన్న వైనం
- జోక్యం చేసుకోకుండా కూర్చోవాలని హెచ్చరించిన సీఎం
అసెంబ్లీలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సహనం కోల్పోయారు. కాంగ్రెస్ నేత ముకేశ్ అగ్నిహోత్రిపై విరుచుకుపడ్డారు. తనను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎం జైరాం మాట్లాడుతూ.. జన్ మంచ్ ప్రోగ్రామ్స్ (జేఎంపీఎస్) పథకానికి సంబంధించిన ఖర్చులపై వివరణ ఇస్తున్నారు.
సీఎం మాట్లాడుతుండగా మధ్యలో కల్పించుకున్న అగ్నిహోత్రి.. ఇదేమీ కొత్తకాదని, ‘ప్రశాసన్ జనతా కే ద్వార్’ పేరుతో కాంగ్రెస్ హయాంలోనే ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చామని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం.. సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ హన్స్‌రాజ్‌ను ఉద్దేశించి.. సభలోని సభ్యుడెవరూ ఇలా జోక్యం చేసుకోవద్దంటూ ఒకింత ఆగ్రహంగా చెప్పారు. మరోసారి ఇలా జోక్యం చేసుకోవద్దని, కూర్చోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, సీఎం తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.