Food Order: పీజీ చదివి, ఉద్యోగం లేక... డెలివరీ బాయ్ పని... వైరల్ అవుతున్న పోస్ట్!
- ఫుడ్ ఆర్డర్ చేసిన అండర్ గ్రాడ్యుయేట్
- పీజీ చదివిన వ్యక్తి వచ్చి డెలివరీ
- విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్
"ఈ దేశానికి ఏమైంది? నా జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని అనుకోలేదు" అంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి షౌవిక్ దత్తా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియాలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని అతను చేసిన వ్యాఖ్యలపై యువత స్పందిస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోల్ కతాకు చెందిన షౌవిక్ దత్తా, జొమాటో యాప్ లో తనకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేయగా, ఫుడ్ డెలివరీ చేసేందుకు మెరాజ్ అనే యువకుడు వచ్చాడు. అతనితో మాటలు కలిపిన షౌవిక్, ఎంకామ్ చదివి, ఆపై ఆర్థిక శాస్త్రంలో పీజీడీఎం చేసిన వ్యక్తి, ఉద్యోగం లేక ఇలా డెలివరీ చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాడు.
ఆపై ఆన్ లైన్ లో స్పందిస్తూ, "నా జీవితంలో ఇటువంటి ఘటన జరుగుతుందని అనుకోలేదు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. జొమాటోలో నేను ఆహారం ఆర్డర్ చేస్తే అది డెలివరీ చేయడానికి వచ్చిన అబ్బాయి ఎంకామ్ చదివాడని తెలిసింది. ఉద్యోగం లేక ఈ పని చేస్తున్నాడట. చాలా విచారకరం. ఆయన కోల్ కతా యూనివర్శిటీ నుంచి ఎంకామ్, ఆర్థిక శాస్త్రంలో పీజీడీఎం కూడా చేశారు. ఈ దేశానికి ఏమైంది. ఈ రాష్ట్రానికి ఏమైంది? ఎంకామ్ చదివిన వ్యక్తి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేయని నాకు ఆహారాన్ని డెలివరీ చేస్తున్నారు. ఈ ఘటన ఏ సందేశాన్ని ఇస్తోంది? ఈ దేశం మారాలి. ఈ రాష్ట్రం మారాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలను సృష్టించాలి. మనం దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం" అని తనకు ఎదురైన అనుభవంపై షౌవిక్ విచారాన్ని వ్యక్తం చేశాడు.