Parents: వెంటిలేటర్ తెచ్చిస్తేనే వైద్యం చేస్తామన్న ప్రభుత్వ వైద్యురాలు.. బాలిక మృతి!
- మరుగుతున్న నీటిలో పడిన బాలిక
- 70 శాతం గాయాలతో ఆసుపత్రిలో చేరిక
- చిన్నారి మృతికి కారకురాలైన వైద్యురాలిపై వేటు
చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక.. కోటి రూపాయల విలువైన వెంటిలేటర్‌ను తీసుకొస్తే చికిత్స చేస్తామన్న వైద్యురాలిపై ప్రభుత్వం వేటు వేసింది. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీలో జరిగిందీ ఘటన. వైద్యురాలి నిర్వాకానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది.
రాజధాని భోపాల్‌కు 186 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్‌కు చెందిన ఏడాది వయసున్న బాలిక అన్సికా అహిర్వార్ ప్రమాదవశాత్తు మరుగుతున్న నీటిలో పడిపోయింది. 70 శాతం గాయాలైన చిన్నారిని బుందేల్‌ఖండ్ మెడికల్ కళాశాలకు తీసుకొచ్చారు. అత్యవసర వైద్య సాయం అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని బాలిక కుటుంబ సభ్యులకు సూచించారు.
ఈ క్రమంలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ జ్యోతి రౌత్ రాగా, తమ బిడ్డకు చికిత్స అందించాల్సిందిగా బాధిత బాలిక తల్లిదండ్రులు అభ్యర్థించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన డాక్టర్ రౌత్.. బాలికకు వెంటనే వెంటిలేటర్ అమర్చాలని, ఆసుపత్రిలోని వెంటిలేటర్ పనిచేయడం లేదని చెప్పారు. తొందరగా వెళ్లి కోటి రూపాయల విలువైన వెంటిలేటర్‌ను కొనుక్కొచ్చి ఇస్తే చికిత్స మొదలుపెడతామని చెప్పడంతో బాధిత కుటుంబం నిర్ఘాంతపోయింది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బాలిక ప్రాణాలు విడిచింది.
బాధిత కుటుంబంపై వైద్యురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు, బాలిక తల్లిదండ్రులు వైద్య సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం డాక్టర్ రౌత్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. కాగా, వైరల్ అవుతున్న వీడియోపై వైద్యురాలు స్పందించింది. దానిని ఎడిట్ చేశారని ఆరోపించింది.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు అడిషనల్ కమిషనర్ ఆధ్యర్యంలో నలుగురు వైద్యులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లోనే ఈ కమిటీ నివేదిక ఇవ్వనుందని, దాని ఆధారంగా చర్యలు ఉంటాయని సాగర్ డివిజనల్ కమిషనర్ మనోహర్ దూబే తెలిపారు.