Vijayawada: గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్బస్లూ ల్యాండ్ కావచ్చు.. నూతన రన్‌వే ప్రారంభం నేడు
- నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఏకైక ఆధారం ఇదే
- ఇప్పటి వరకు చిన్న విమానాల రాకపోకలకే అనుకూలం
- ఇకపై భారీ విమానాలకూ అవకాశం
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టులో చిన్న విమానాలే కాదు ఇకపై ఎయిర్‌బస్‌లు కూడా ల్యాండ్ కావచ్చు. విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్‌వే అందుబాటులోకి వస్తుండడంతో ఇది సాధ్యపడుతోంది. రాష్ట్ర విభజన అనంతరం కొత్తరాజధానిగా అమరావతిని నిర్ణయించి అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు తాత్కాలిక భవన సముదాయాల్లో అసెంబ్లీ నుంచి పలు విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తూనే శాశ్వత భవనాల నిర్మాణం మరోవైపు కొనసాగుతోంది. దీంతో నిత్యం వేలాది మంది అమరావతికి రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల రాకపోకలు జరుగుతున్నాయి. ఇక్కడ అందుబాటులో ఉన్నది గన్నవరం విమానాశ్రయమే.
ఈ విమానాశ్రయంలో చిన్న విమానాలు తప్ప పెద్ద విమానాలు దిగే సదుపాయం ఇప్పటి వరకు లేదు. దీంతో విమానాశ్రయంలో 3,523 అడుగుల వైశాల్యంతో నూతన రన్‌వేను నిర్మించారు. ఈ రన్‌వేను ఈరోజు కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ రన్‌వే అందుబాటులోకి వస్తే ఎయిర్ బస్ విమానాలు కూడా సులువుగా గన్నవరానికి రాకపోకలు జరిపే అవకాశం ఉంటుంది.