Kiran Bedi: వాహనదారులకు ముచ్చెమటలు పట్టించిన కిరణ్ బేడీ!
- ప్రస్తుతం పుదుచ్చేరి ఎల్జీగా కిరణ్ బేడీ
- రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం
- స్వయంగా రంగంలోకి దిగిన కిరణ్ బేడీ
ఐపీఎస్ అధికారిణిగా తన కెరీర్ ను ప్రారంభించి, ఆపై బీజేపీలో చేరి, ప్రస్తుతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీ, మరోసారి తనలోని పోలీసును బయటకు తీశారు. పుదుచ్చేరిలో హెల్మెట్, సీట్ బెల్ట్ లను తప్పనిసరి చేయగా, ఆమె పోలీస్ అవతారం ఎత్తి, వీధుల్లోకి వచ్చి వాహనదారులను గడగడలాడించారు.
ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన తీసుకురావాలంటూ పలు మార్గాల్లో స్వయంగా తనిఖీలు చేశారు. హెల్మెట్ లేకుండా వెళుతున్నవారిని ఆపించి, క్లాస్ పీకారు. ఓ బైక్ పై ఇద్దరు మహిళలతో వస్తున్న యువకుడిని ఆపి, గట్టిగా మందలించి, ఓ మహిళను దింపేసి, బస్సులో వెళ్లాలని సలహా ఇచ్చారు. పిల్లలతో వెళుతూ హెల్మెట్ పెట్టుకోని వాళ్లకు మరింత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కార్లలో వస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోని వారిని ఆపి హెచ్చరించారు. ఓవర్ లోడింగ్ తో వెళుతున్న రవాణా వాహనాలనూ ఆమె వదల్లేదు. స్వయంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీధుల్లోకి రావడంతో పోలీసు అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది.