vote ki note: ఓటుకు నోటు కేసు విచారణ.. అధికారులు అడిగిన డాక్యుమెంట్లన్నీ అందజేశా: వేం నరేందర్ రెడ్డి
- అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పా
- ఈ కేసుతో నా కుమారులకు సంబంధం లేదు
- విచారణకు నా కుమారులను ఈడీ పిలవడం బాధాకరం
సుమారు ఆరు గంటలకు పైబడి కొనసాగిన ఓటుకు నోటు కేసు విచారణ ముగిసింది. ఈ కేసు విచారణ నిమిత్తం హాజరైన కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి, ఆయన ఇద్దరు కుమారులను ఈడీ అధికారులు వేర్వేరుగా విచారించారు. విచారణ ముగిసిన అనంతరం, మీడియాతో వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని, వారు అడిగిన డాక్యుమెంట్లన్నీ అందజేశానని చెప్పారు. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వారి ముందు హాజరవుతానని, తనతో పాటు తన ఇద్దరు కుమారులు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
ఈ కేసుతో సంబంధం లేని తన కుమారులను ఈడీ పిలవడం బాధాకరమని, ఈడీ అధికారులు తమను వేర్వేరుగా విచారించినట్టు చెప్పారు. రూ.50 లక్షలు ఎవరు సమకూర్చారన్నది న్యాయస్థానాలు తేలుస్తాయని అన్నారు. ఈ కేసు వ్యవహారం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కేంద్రానికి అప్పగించినట్టు అనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని, వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించారని అన్నారు.