Joe Root: ‘గే’గా ఉంటే తప్పేంటన్న ఇంగ్లండ్ కెప్టెన్.. సోషల్ మీడియాలో హీరోగా మారిన వైనం
- జో రూట్‌పై స్లెడ్జింగ్‌కు దిగిన విండీస్ బౌలర్
- హోమో ఫోబిక్ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం
- ఆ పదాన్ని తిట్టేందుకు వాడొద్దన్న రూట్
‘గే’గా ఉండడం తప్పుకాదన్న ఇంగ్లండ్ జట్టు సారథి జో రూట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీరోగా మారాడు. విండీస్-ఇంగ్లండ్ మధ్య సెయింట్ లూసియాలో జరిగిన మూడో టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్ స్కిప్పర్ రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. దూకుడు మీదున్న రూట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన విండీస్ బౌలర్ షానన్ గాబ్రియేల్ ‘హోమో ఫోబిక్’ అనే పదాన్ని ఉపయోగించాడు.
ఇది విన్న రూట్ వెంటనే స్పందించాడు. ‘హోమో ఫోబిక్’ (గే) అనే పదాన్ని తిట్టడానికి వాడొద్దని, ‘గే’గా ఉండడంలో తప్పులేదని పేర్కొన్నాడు. వీరి సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. రూట్ సమయస్ఫూర్తికి, పరిణతికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడిని తెగ పొగిడేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, తనను దూషించిన గాబ్రియేల్‌ను రూట్ ప్రశంసించాడు. అతడో అద్భుతమైన ఆటగాడని, ఆటలో భాగంగానే అతడు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 232 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కాగా, జో రూట్‌ను దూషించిన గాబ్రియేల్‌పై అభియోగాలు నమోదు చేసిన ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది.