Karanam Balaram: ఆమంచి రాజీనామా చేయగానే... కరణం బలరాంను రంగంలోకి దించిన చంద్రబాబు!
- ఏపీలో మారిపోతున్న రాజకీయాలు
- చీరాల బాధ్యతలు కరణం బలరాంకు అప్పగింత
- కార్యకర్తలు పార్టీని వీడకుండా చూడాలని ఆదేశం
సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఈ ఉదయం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించగానే, అలర్ట్ అయిన ఆయన, కరణం బలరాంకు చీరాల బాధ్యతలు అప్పగించారు. వెంటనే చీరాల తెలుగుదేశం నేతల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో, కరణం బలరాం హుటాహుటిన చీరాలకు బయలుదేరి వెళ్లారు. వెంటనే సమావేశమై, ఆమంచితో పాటు నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న ఆమంచి, లోటస్ పాండ్ లోని జగన్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు.