Vijayanagaram District: రాత్రికి విశాఖకు ముఖ్యమంత్రి.. రేపు భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన
- 2200 కోట్ల రూపాయల వ్యయంతో భోగాపురం ఎయిర్‌పోర్టు
- ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేసుకోనున్న ఎయిర్ పోర్టు
- విమానాల విడిభాగాల తయారీ కేంద్రం కూడా ఇక్కడే
నవ్యాంధ్రలో ఆర్థిక రాజధానిగా, ఐటీ సిటీగా పేరు గడిస్తున్న విశాఖ నగరానికి సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. దాదాపు 2200 కోట్ల రూపాయల వ్యయంతో విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించనున్న ఈ విమానాశ్రయం పనులకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబునాయుడు రాత్రికి నేరుగా విశాఖ చేరుకుంటారు. పోర్టు గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేసి ఉదయాన్నే హెలికాప్టర్లో భోగాపురం చేరుకుని అక్కడి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే అంతర్జాతీయ భారీ విమానాల రాకపోకలకు మార్గం సుగమం అవుతుంది. విదేశాలకు కూరగాయల ఎగుమతి, దిగుమతులకు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. విమానాశ్రయం పరిధిలోనే విమాన విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.
విమానాశ్రయానికి శంకుస్థాపన అనంతరం సీఎం కాపులుప్పాడ చేరుకుని అక్కడ ఆదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న డేటాసెంటర్కు భూమిపూజ చేస్తారు. అనంతరం విశాఖ రూరల్ ప్రాంతంలోని అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడి సెజ్‌లో ఏషియన్ పెయింట్స్ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమను రిమోట్ కంట్రోల్‌తో ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి అమరావతి వెళ్తారు.