maoist: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సుధాకర్ దంపతుల లొంగుబాటు
- నిర్మల్ జిల్లా సారంగాపూర్ కు చెందిన వ్యక్తి సుధాకర్
- భార్య అరుణ మావోయిస్టు స్టేట్ కమిటీలో సభ్యురాలు
- సుధాకర్ పై ఉన్న ప్రభుత్వ రివార్డ్ ను ఆయనకు అందజేస్తాం
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సుధాకర్ దంపతులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్, ఆయన భార్య అరుణను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, సుధాకర్ పై రూ.25 లక్షల ప్రభుత్వ రివార్డ్ ఉన్నట్టు చెప్పారు. ఈ రివార్డ్ ను సుధాకర్ కి అందజేస్తామని చెప్పారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ కు చెందిన వ్యక్తి సుధాకర్ అని, స్వగ్రామంలో 7వ తరగతి వరకు చదువుకున్నాడని చెప్పారు. 8 నుంచి ఇంటర్మీడియట్ వరకు నిర్మల్ గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్నట్టు వివరించారు. 1983 లో పీపుల్స్ వార్ ఐడియాలజీకి ఆకర్షితుడైన సుధాకర్ అందులో చేరడంతో, ఇంటర్మీడియట్ చదువు మధ్యలోనే ఆపేశాడని అన్నారు. మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశాడని అన్నారు. కొరియర్ స్థాయి నుంచి సెంట్రల్ కమిటీ సభ్యుడి స్థాయికి ఆయన ఎదిగాడని, మావోయిస్టు మిలిటరీ విభాగంలో ఆయన ఎక్కువ కాలం పనిచేసినట్టు చెప్పారు.
కాగా, కుల వ్యవస్థ ప్రభావం మావోయిస్టు పార్టీలో కూడా ఉందని సుధాకర్ చెప్పిన విషయాన్ని మహేందర్ రెడ్డి ప్రస్తావించారు. సుధాకర్ భార్య అరుణ స్వగ్రామం వరంగల్ జిల్లాలోని మహ్మదాపూర్ అని మహేందర్ రెడ్డి తెలిపారు. ఆమె 8వ తరగతి వరకు చదువుకుందని, గ్రామంలోకి మావో దళాలు వెళ్లినప్పుడు, వారు పాడే పాటలకు ఆకర్షితురాలైన ఆమె ఆ బాట పట్టిందని అన్నారు. అరుణ మూడో తరగతి చదువుతున్న సమయంలో ఆమెకు బాల్య వివాహమైందని, అయితే, మావోలతో వెళ్లిపోవడంతో తన కుటుంబానికి దూరమైన ఆమె, 1998లో సుధాకర్ ను పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. మావోయిస్టు స్టేట్ కమిటీలో సభ్యురాలిగా, జార్ఖండ్, బీహార్ మావోయిస్టు కమిటీల్లో ఆమె పని చేసినట్టు చెప్పారు.