YSRCP: ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
- ఓటర్లకు లక్ష గడియారాలు పంపిణీ చేస్తున్నారు
- వీటి విలువ రూ.10 కోట్లు ఉంటుంది
- దీనిపై నిగ్గు తేల్చాల్సిందిగా ఈసీని కోరా: తుడా చైర్మన్
ఓటర్లను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రలోభాలకు గురి చేస్తున్నారని చిత్తూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి, తుడా చైర్మన్ జి. నర్సింహ యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి తగిన ఆధారాలను ఆయన సమర్పించారు. రూ.10 కోట్ల విలువైన లక్ష గడియారాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారని చెవిరెడ్డిపై ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నర్సింహ యాదవ్ మాట్లాడుతూ, పది కోట్ల రూపాయల విలువ చేసే సరుకు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. దీనిపై నిగ్గు తేల్చాల్సిందిగా ఈసీ అధికారులను కోరామని అన్నారు.
ఒకో ఓటుకు ఐదు వేల రూపాయలు అడగమని వైసీసీ అధినేత జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా ఈసీ స్పందించి, జగన్ పై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి కనుక ఆయనపై ఈసీ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతి సంపాదనతో కోట్లను కూడగట్టిన జగన్, ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కో నియోజకవర్గంలో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని, దీనిపై ఈసీ నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.