16th lok sabha: ఈ విషయంలో ఎంపీలందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి: స్పీకర్ సుమిత్రా మహాజన్
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేశామా? లేదా?
- ఈ విషయమై ఎంపీలందరూ ఆలోచించుకోవాలి
- ఇంకా ఏం చేయాల్సి ఉందో ఎంపీలు గుర్తించాలి
ఈ ఐదేళ్లలో తాము ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేశామా? లేదా? అనే విషయమై ఎంపీలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. 16వ లోక్ సభ చివరి రోజు సమావేశం ముగింపు సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, తమ నియోజక వర్గాలకు ఇంత వరకు ఏం చేశాం? ఇంకా ఏం చేయాల్సి ఉందన్న విషయాలను ఆయా నియోజకవర్గాల ఎంపీలు గుర్తించాలని సూచించారు. పదహారవ లోక్ సభలో 205 చట్టాలు ఆమోదం పొందడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, లోక్ సభలో సభ్యుల గందరగోళాల కారణంగా జూన్ 2014 నుంచి నేటి వరకు 422 గంటల 19 నిమిషాలు వృథా అయ్యాయని అన్నారు. ఈ లోక్ సభను 1,612 గంటలు అంటే 331 సిట్టింగ్ లు కొనసాగించామని తెలిపారు.