sharmila: ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దామనే.. షర్మిల వీడియోల కేసులో నిందితుల వాంగ్మూలం!
- షర్మిలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
- నిందితులు పెద్దిశెట్టి వెంకటేష్, ఏ నవీన్ విచారణ
- మరికొందరికి నోటీసులు జారీ
వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు షర్మిల, ప్రభాస్ లపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, వీడియోలను చూసి, తాను కూడా అదే విధంగా చేస్తే, ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దామనే వీడియోలు తయారు చేసి పోస్ట్ చేశామని నిందితులు పెద్దిశెట్టి వెంకటేష్, ఏ నవీన్ లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వీరిద్దరినీ ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో వీరిని మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు పలు విషయాలు రాబట్టారు.
షర్మిలపై తమకు కక్షగానీ, దురుద్దేశంగానీ లేవని, రాజకీయ ప్రయోజనాలు ఆశించి వీడియోలు తయారు చేయలేదని నిందితులు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం తాను ఆరు వీడియోలను పోస్ట్ చేసినట్టు వెంకటేష్ అంగీకరించగా, తాను రెండురోజుల వ్యవధిలో నాలుగు వీడియోలు మాత్రమే అప్ లోడ్ చేశానని నవీన్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో వీరు అప్ లోడ్ చేసిన ఫొటోలు, వీడియోల్లో ఉన్న కంటెంట్ ఎక్కడిదన్న విషయమై పోలీసులు కూపీ లాగుతున్నారు.
కాగా, ఈ కేసులో మరిన్ని యూ ట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులకు నోటీసులు జారీ అయ్యాయి. రెండు చానెళ్లలో షర్మిల వ్యక్తిగత జీవితంపై 100కు పైగా వీడియోలను పోస్ట్ చేశారని గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు, వారిని వ్యక్తిగతంగా హాజరు కావాలని, సాంకేతిక సమాచారంతో రావాలని ఆదేశించారు.