modi: అప్పట్లో రాజీనామా చేస్తానని మోదీకి చెప్పా.. కానీ ఆయన వారించారు!: దేవెగౌడ
- బీజేపీకి 276 సీట్ల కంటే ఎక్కువ వస్తే రాజీనామా చేస్తానని ప్రకటించా
- కానీ బీజేపీకి 282 సీట్లు వచ్చాయి
- సవాల్ ను సీరియస్ గా తీసుకోవద్దని మోదీ నాతో చెప్పారు
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని మోదీకి చెప్పానని... కానీ, అందుకు ఆయన ఒప్పుకోలేదని మాజీ ప్రధాని దేవెగౌడ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సభలో ఉన్న సీనియర్ నాయకుల్లో ఒకరైన మీరు ఎంపీగా కొనసాగాలని మోదీ తనను కోరారని, దాంతో తన ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు.
లోక్ సభలో నిన్న ప్రసంగిస్తూ దేవెగౌడ ఈ విషయాన్ని తెలిపారు. బీజేపీకి 276 సీట్ల కంటే ఎక్కువ వస్తే రాజీనామా చేస్తానని ఎన్నికల సమయంలో తాను ప్రకటించానని... బీజేపీ 282 సీట్లను గెలుచుకోవడంతో మాటకు కట్టుబడి రాజీనామాకు సిద్ధమయ్యానని చెప్పారు.
అయితే, ఎన్నికల సమయంలో చేసిన సవాల్ ను సీరియస్ గా తీసుకోవద్దని మోదీ తనతో అన్నారని దేవెగౌడ తెలిపారు. మీకు ఎంతో అనుభవం ఉందని... మీరు రాజీనామా చేయకూడదని మోదీ కోరారని చెప్పారు. మోదీని తాను మూడు, నాలుగు సార్లు కలిశానని తెలిపారు. తనకు ఎవరితోనూ ఎలాంటి పేచీలు లేవని చెప్పారు.
ఇదే సమయంలో దేవెగౌడ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ సోనియాగాంధీ ప్రధాని కాలేకపోయారని అన్నారు. దీంతో, ఆయన పక్కనే ఉన్న సోనియాగాంధీ స్పందిస్తూ, ప్రధాని కావాలనే కాంక్ష తనకు లేదని చెప్పారు. వెంటనే దేవెగౌడ మాట్లాడుతూ, సోనియాకు పీఎం కావాలనే కోరిక లేదని చెప్పారు.