Uttar Pradesh: మీ నాన్న చెప్పింది అక్షరాలా నిజం...ఆయనను చూసి నేర్చుకో!: అఖిలేశ్ కు సీఎం యోగి సూచన
- ఎన్నికల వేళ ములాయం వ్యాఖ్యలతో బీజేపీలో ఖుషీ
- ప్రధాని అందరినీ కలుపుకొనిపోతున్నారన్న మాజీ సీఎం
- ఈ మాటలు పాటించాలని అఖిలేశ్ కు సూచన చేసిన యోగి
తండ్రి చెప్పిన మాటలను వినమని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు ప్రస్తుతం సీఎం యోగి హితవు పలికారు. ‘నిజం ఎప్పటికైనా నిజమే. ప్రధాని నరేంద్రమోదీ అందరినీ కలుపుకొని పోతున్నారని, ఆయన మళ్లీ ప్రధాని కావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ నిజం పలికారు. ఆయన కొడుకు అఖిలేశ్ కూడా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తే బాగుంటుంది’ అని యోగి సూచించారు.
బుధవారం పార్లమెంటులో ప్రసంగిస్తూ ములాయం ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పక్కన ఉండగానే ములాయం ఇలా వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ శ్రేణులతోపాటు సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి. వెంటనే స్పందించిన ఎస్పీ వర్గాలు తమ పార్టీ అధినేత అఖిలేశ్ గాని, ములాయం కాదంటూ ఈ వ్యాఖ్యలను ఖండించారు. అయితే ములాయం వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించడంతో బీజేపీ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయి.
యూపీ ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకువేసి ఈ విషయాన్ని అఖిలేశ్ కూడా గుర్తించాలని ఉచిత సలహా ఇచ్చేశారు. కాగా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలతో జట్టుకట్టిన అఖిలేశ్ కు ములాయం వ్యాఖ్యలు ఊహించని శరాఘాతమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.