YSRCP: అందుకే, మోదీతో చంద్రబాబు విభేదించారు: అవంతి శ్రీనివాస్ ఆరోపణలు
- టీడీపీ ఎమ్మెల్యే అవినీతిపై పీఎంఓకు ఫిర్యాదు వెళ్లింది
- ఈ ఫిర్యాదుపై పీఎంఓ విచారణ జరిపింది
- అప్పటి నుంచి మోదీతో బాబు విభేదించారు
టీడీపీకి, తన ఎంపీ పదవికి తాజాగా రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే అవినీతి గురించి ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కు ఫిర్యాదు వెళ్లిందని, ఈ ఫిర్యాదుపై పీఎంఓ విచారణ జరిపిందని అన్నారు. తమ ఎమ్మెల్యే అవినీతి బాగోతం వెలుగు చూడటం వల్లే మోదీతో చంద్రబాబుకు విభేదాలు తలెత్తాయని ఆరోపించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు నాయుడు మూడుసార్లు సీఎంగా చేశాను కనుక తాను చెప్పిందే ప్రజలు వినాలనుకుంటే కుదరదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక అవకాశం జగన్ కు కూడా ప్రజలు ఇవ్వాలని, ఆయన అధికారంలోకొస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తే ఆ పార్టీకే తమ మద్దతు అని జగన్ మొదటి నుంచి చెబుతున్నారని, ‘అది రియాల్టీ’ అని అన్నారు.