Pawan Kalyan: పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పవన్ కల్యాణ్
- ఉగ్రవాదుల తీరు హేయం
- జవాన్ల మృతి మనసును కలిచివేస్తోంది
- దేశం యావత్తు అండగా నిలవాల్సిన సమయమిది
జమ్ముకశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 42 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులది హేయమైన చర్య అని పేర్కొన్నారు. జవాన్ల మృతి తనను కలచివేసిందన్నారు. మృతుల సంఖ్య పెరుగుతుండడం మరింత బాధ కలిగిస్తోందన్నారు. అమర వీరులకు తన తరపున, జన సైనికుల తరపున సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు.
అమరులైన జవాన్ల త్యాగాలను భరత జాతి ఎప్పటికీ మర్చిపోదని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు దేశం యావత్తు అండగా నిలవాలని కోరారు. ఉగ్రవాదులు మనవైపు మరోసారి కన్నెత్తి చూడకుండా జవాన్లలో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం కేంద్రంపై ఉందని పవన్ పేర్కొన్నారు.