Jyothi: జ్యోతిని చంపిందెవరు? ఐదు రోజులైనా తేలని మిస్టరీ!
- ఐదు రోజుల క్రితం హత్య
- కాల్ డేటా విశ్లేషణలో ఏమీ తేల్చని పోలీసులు
- నిందితులను అరెస్ట్ చేయాలంటూ నిరసనలు
తనను ప్రేమించిన శ్రీనివాస్ తోనే జ్యోతి వెళ్లింది. ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా గడపాలని భావించి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. కాసేపటి తరువాత శ్రీనివాస్, తన స్నేహితులకు ఫోన్ చేసి, తమపై దాడి జరిగిందని చెప్పాడు. ఆపై పోలీసులు వచ్చారు. అప్పటికే జ్యోతి విగతజీవిగా ఉండగా, ఆమె పక్కనే శ్రీనివాస్ రోదిస్తూ కనిపించాడు. శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
అయితే, ఈ విచారణ మొదలై ఐదు రోజులు గడిచినా, నిందితులు ఎవరన్న విషయాన్ని ఇప్పటివరకూ పోలీసులు తేల్చలేదు. తమకు శ్రీనివాస్ పైనే అనుమానం ఉందని జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో శ్రీనివాస్ కాల్ డేటాను, జ్యోతి కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు, ఓ యువతి పదేపదే ఫోన్ చేయగా జ్యోతి బయటకు వచ్చి శ్రీనివాస్ ను కలిసిందని మాత్రమే తేల్చారు.
ఇప్పటివరకూ ఆ యువతి ఎవరన్న విషయం తేలలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న శ్రీనివాస్ ను లోతుగా ప్రశ్నిస్తే కేసులో చిక్కుముడి వీడేలా మరేదైనా ఆధారం లభిస్తుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో జ్యోతి మృతదేహం పోస్టుమార్టంపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె దుస్తులను సేకరించకపోవడం పోలీసుల ప్రవర్తనపై అనుమానం పెంచగా, ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఆపై ఆమెను ఖననం చేసిన ప్రాంతాన్ని తిరిగి తవ్వించిన పోలీసులు, దుస్తులను సేకరించారు. ఈ కేసులో అసలు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ జ్యోతి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ ఉదయం రాస్తారోకోకు దిగారు.