Jammu And Kashmir: రెండో కుమారుడిని కూడా సైన్యంలోకే పంపుతా.. 'వీర జవాన్' తండ్రి భావోద్వేగం!
- ఆత్మాహుతి దాడిలో 43 మంది దుర్మరణం
- బిహార్ కు చెందిన రతన్ ఠాకూర్ వీరమరణం
- మరో కుమారుడిని కూడా సైన్యంలోకి పంపుతామన్న జవాన్ తండ్రి
పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ నిన్న చేసిన ఆత్మాహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనలో మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లలో బిహార్ భాగల్పూర్కు చెందిన రతన్ ఠాకూర్ కూడా ఉన్నారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న రతన్ తండ్రి గుండె నిబ్బరం ప్రదర్శించారు. తన రెండో కుమారుడిని కూడా సైన్యంలోకే పంపుతానని చెప్పి, దేశభక్తిని చాటారు.
ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ..‘నా కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. భరతమాత కోసం అమరుడై చరిత్రలో నిలిచిపోయాడు. ఓ తండ్రిగా ఈ విషయంలో ఎంతో గర్విస్తున్నా. ప్రస్తుతం నేను బాధను, గర్వాన్ని అనుభవిస్తున్నాను. నా కొడుకు లాంటి మరి కొందరు వీర జవాన్లను చంపి.. వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చిన పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. పాక్కు తగిన గుణపాఠం నేర్పడం కోసం మరో కుమారుడిని కూడా సైన్యంలోకే పంపిస్తాను. తనను కూడా భరతమాత సేవకే అర్పిస్తాను’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.