Telangana: మలుపు తిరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ కేసు.. మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు జారీ
- అప్పటి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌లను బహిష్కరించిన మధుసూదనాచారి
- కోర్టు నోటీసులను పట్టించుకోని స్పీకర్
- అరెస్ట్ చేసి తీసుకురావాల్సి ఉంటుందంటూ హెచ్చరిక
తెలంగాణ గత శాసనసభలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన కేసు హైకోర్టులో కొత్త మలుపు తిరిగింది. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులను కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు అదుపులోకి తీసుకుని జుడీషియల్ రిజిస్ట్రార్‌కు అప్పగించింది. అయితే, పదివేల రూపాయల చొప్పున ఇద్దరూ వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి విడుదలయ్యారు.
కాగా, ఈ కేసులో అప్పటి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టేనని అభిప్రాయపడిన కోర్టు ఆయనను కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసింది. అలాగే, నోటీసులిచ్చినా ఎందుకు స్పందించలేదంటూ అప్పటి డీజీపీ, నల్గొండ, జోగులాంబ గద్వాల జిల్లాల ఎస్పీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని, తదుపరి విచారణకు హాజరుకాకుంటే సుప్రీంకోర్టుకు నివేదిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
మరోవైపు, హైకోర్టు నోటీసులను విస్మరించిన మధుసూదనాచారిపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చిన సందర్భాలు గతంలో ఉన్నాయంటూ మధుసూదనాచారికి హెచ్చరికలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో తాము ఇచ్చిన నోటీసులకు ఎందుకు స్పందించలేదో మార్చి 8న చెప్పాలంటూ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, డీజీపీ, నల్గొండ, జోగులాంబ ఎస్పీలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.