Andhra Pradesh: జగన్ కు ఎన్నికల కంటే వ్యాపారమే ముఖ్యం.. అందుకే హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారు!: ఏపీ సీఎం చంద్రబాబు

  • ఏపీలో ఉండటం ఆయనకు ఇష్టం లేదు
  • వైసీపీలో అందరూ వన్ టైమ్ ఆటగాళ్లే
  • టీడీపీ నేతలతో ఏపీ సీఎం టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో నివసించడం వైసీపీ అధినేత జగన్ కు ఎంతమాత్రం ఇష్టం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అందుకే జగన్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతో జగన్ తన పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఆస్తులున్న టీడీపీ నేతలను కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎక్కువ డబ్బులు ఇచ్చేవారికే జగన్ టికెట్ ఇస్తారనీ, ఓసారి పోటీ చేసినవారికి ఆయన అవకాశమివ్వరని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ కు ఎన్నికల కంటే వ్యాపారమే ముఖ్యమని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీలో అందరూ వన్ టైమ్ ఆటగాళ్లేనని ఎద్దేవా చేశారు.

రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్  ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచామని ఏపీ సీఎం తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఈరోజు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చామని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ప్రస్తుతం ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను మరింత పెంచుకునేందుకు కృషి చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
Telangana
KCR
teleconference

More Telugu News