siddu: నా మాటలను వక్రీకరించారు.. వేల మంది జవాన్లు ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోరా?: సిద్దూ
- ఎలాంటి ఆహ్వానం లేకపోయినా పాకిస్థాన్ కు మోదీ వెళ్లారు
- డబుల్ గేమ్ ఆడుతున్న నాయకులను శిక్షించాల్సిందే
- అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఉగ్రవాదానికి చెక్ పెట్టవచ్చు
పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ సిద్దూ విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెబుతూనే... ఎవరో పిరికిపందలు చేసిన పనికి, ఆ దేశం మొత్తాన్ని నిందించడం సరికాదనే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. కర్తాపూర్ కారిడార్ విషయంలో ఇరు దేశాలు ఇటీవలే ముందడుగు వేశాయని... ఉగ్రదాడి ప్రభావం దీనిపై పడరాదని అన్నారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను తాను ఆలింగనం చేసుకోవడంలో తప్పు లేదని సిద్దూ చెప్పారు. అప్పటి ప్రధాని వాజ్ పేయి కూడా పాకిస్థాన్ లో పర్యటించారని గుర్తు చేశారు. ఎలాంటి ఆహ్వానం లేకపోయినా మోదీ కూడా పాకిస్థాన్ వెళ్లారని చెప్పారు.
అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఉగ్రవాదానికి చెక్ పెట్టవచ్చని సిద్దూ అన్నారు. ఈ విషయంలో మన నాయకులు కొందరు డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఇలాంటి కుట్రదారులను కూడా శిక్షించాల్సిందేనని అన్నారు. ఓ రాజకీయ నేత ప్రయాణిస్తే సిటీ మొత్తాన్ని దిగ్బంధిస్తారని... వేల మంది జవాన్లు ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. మరోవైపు, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో... కపిల్ శర్మ షో నుంచి సిద్దూను తొలగించారు. ఆయన స్థానంలో అర్చనా పూరణ్ సింగ్ ను తీసుకున్నారు.