india: పాక్ ను నాలుగోసారి హెచ్చరించిన ప్రధాని మోదీ
- ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న వారిని విడిచిపెట్టం
- ఉగ్రవాదానికి మారుపేరుగా పాక్ మారింది
- ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షిస్తాం
జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి తీరతామని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టమని, ఉగ్రవాదానికి మారుపేరుగా పాక్ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దారుణ ఘటనకు కారకులైన వారు ఎక్కడా దాక్కోలేరని, ఎంత మంది ఉన్నా, ఎక్కడ దాక్కున్నా ఖాతరు చేసేది లేదని కఠినంగా శిక్షిస్తామని మోదీ హెచ్చరించారు. ఒక్క రోజులో ఈ విధంగా మోదీ హెచ్చరించడం ఇది నాల్గోసారి. అమరజవాన్ల త్యాగాలను వృథా కానీయమని, ప్రతీకార దాడులు జరిపేందుకు భారత బలగాలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చామని, ఏ సమయంలో చర్యలు చేపట్టాలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్న విషయాన్ని గ్రహించానని, మరోసారి దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానని, తగిన ఓర్పు, విశ్వాసంతో వారుండాలని మోదీ సూచించారు.