Reliance: పుల్వామా బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ ఆపన్నహస్తం
- ముఖేష్ అంబానీ ఉదారత
- అన్ని విధాలా చేయూతకు నిర్ణయం
- విద్య, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యం
పుల్వామా ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయపడేందుకు రిలయన్స్ ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం జమ్మూకాశ్మీర్లోని పుల్వామా వద్ద సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన ఉగ్రదాడిలో పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. ఈ దాడికి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తమదే బాధ్యత అని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. సీఆర్పీఎఫ్ అమరవీరుల కుటుంబాల్లో తీవ్ర విషాదం తాండవిస్తున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది.
అమరవీరుల కుటుంబాలకే కాదు, క్షతగాత్రులకు కూడా సాయం చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని రిలయన్స్ వర్గాలు ప్రకటించాయి. అమరజవాన్ల వారసులకు జీవితకాలం తోడుంటామని, ముఖ్యంగా వారి విద్య, ఉపాధి కల్పన వంటి ప్రధాన అంశాల్లో అన్ని రకాలుగా చేయూతనిస్తామని ఫౌండేషన్ భరోసా ఇచ్చింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మరింత మెరుగైన చికిత్స అవసరమని భావిస్తే తమ ఫౌండేషన్ కు చెందిన ఆసుపత్రులకు వారిని తరలించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా రిలయన్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.