Cricket: పుల్వామా అమర జవాన్ల కుటుంబాల కోసం రంజీ చాంపియన్ల పెద్ద మనసు
- ప్రైజ్ మనీ విరాళంగా ఇవ్వాలని నిర్ణయం
- జట్టు తరఫున ప్రకటన చేసిన కెప్టెన్
- ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన వైనం
పుల్వామా ఆత్మాహుతి దాడి బాధితులను ఆదుకునేందుకు రంజీ చాంపియన్ విదర్భ జట్టు ముందుకొచ్చింది. తాము గెల్చుకున్న ప్రైజ్ మనీని సీఆర్పీఎఫ్ అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేందుకు ఆ జట్టు నిర్ణయించుకుంది. మైదానంలోనే కాదు బయట కూడా తాము విజేతలమని చాటుకుంది. విదర్భ జట్టు తాజాగా ఇరానీ ట్రోఫీలో విజేతగా నిలిచింది.
అంతకుముందు రంజీ ట్రోఫీలోనూ టైటిల్ నెగ్గి వరుసగా రెండో ఏడాది డబుల్ సాధించింది. గత సీజన్ లోనూ విదర్భ జట్టు రంజీ, ఇరానీ ట్రోఫీలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. పేరుమోసిన స్టార్ ఆటగాళ్లెవరూ లేకపోయినా తన అమోఘమైన ఆటతీరుతో క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్న విదర్భ సామాజిక బాధ్యత దృష్ట్యా తన పెద్ద మనసు చాటుకుంది. ఆ జట్టు సారథి ఫయాజ్ ఫజల్ తమ జట్టు గెల్చుకున్న రూ.10 లక్షల ప్రైజ్ మనీ మొత్తం పుల్వామా అమర వీరుల కుటుంబాలకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. తమ జట్టు తరఫున ఇది చిన్న సాయం మాత్రమేనని చెప్పాడు ఫయాజ్ ఫజల్.