Rajinikanth: డ్రంకెన్ డ్రైవ్ వ్యవహారంలో 'రజనీకాంత్' ను ఉపయోగించుకున్న ఆస్ట్రేలియా పోలీసులు
- రజనీ ఫొటో ట్వీట్ చేసిన డెర్బీ కాప్స్
- ఫ్యాన్స్ సంబరాలు
- తలైవా గ్రేట్ అంటూ కామెంట్లు
రజనీకాంత్ ఎందుకు సూపర్ స్టార్ అయ్యాడో ఈ ఘటనతో మరింత విపులంగా తెలుసుకోవచ్చు. ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఇండియా! తమిళ చిత్రాలతో విపరీతమైన పాప్యులారిటీ తెచ్చుకున్న రజనీకాంత్ కు భారత్ వెలుపల కూడా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జపాన్ లో రజనీకి ప్రత్యేకంగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అభిమానుల వరకు ఓకే! కానీ, ఎక్కడో ఆస్ట్రేలియాలోని ఓ పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా రజనీకాంత్ మేనియాలో పడిపోయిందా అని సందేహం వచ్చే సంఘటన ఇది.
ఇటీవల ఆస్ట్రేలియాలోని డెర్బీ పోలీస్ డిపార్ట్ మెంట్ రోజువారీ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది. అందులో ఓ వ్యక్తి శ్వాసను పరీక్షించగా అధికారులే దిమ్మదిరిగిపోయే రిజల్ట్ వచ్చింది. అతడి శ్వాసను బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా ఆల్కహాల్ స్థాయి 0.341 శాతం చూపించింది. సాధారణంగా ఓ వ్యక్తి రక్తంలో ఈ స్థాయిలో ఆల్కహాల్ ఉందంటే అతడు కోమాలో అన్నా ఉండాలి లేక ఆపరేషన్ కోసం మత్తుమందు ఇచ్చిన రోగి అయినా అయ్యుండాలి.
జీవశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం ఓ వ్యక్తి ఈ స్థాయిలో బ్లడ్ ఆల్కహాల్ లెవల్స్ తో కారు నడపడం అసాధ్యం. అలాంటిదేమీ లేకుండా నిక్షేపంగా కారు నడుపుతున్న వ్యక్తి శ్వాసను పరీక్షిస్తే ఇలా వచ్చిందేంటి అనుకుని డెర్బీ పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. దాంతో ఆ వ్యక్తి శ్వాస పరీక్ష వివరాలను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో రజనీకాంత్ పిక్ ను ఉపయోగించడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి అద్భుతాలకు ఆద్యుడు రజనీకాంత్ అని బలంగా నమ్మారేమో! ఇది సైన్స్ కే అంతుబట్టని రహస్యం అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల వచ్చిన రోబో 2.0లో ఓ సీన్ లో రజనీకాంత్ ప్రభుత్వ అధికారులతో దేశాన్ని నాశనం చేస్తున్న ఫిఫ్త్ ఎలిమెంట్ గురించి చర్చిస్తుంటాడు. ఇప్పుడు ఆ సీన్ కు సంబంధించిన ఫొటోను తమ ట్వీట్ కు జతచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు ఆస్ట్రేలియా పోలీసులు. ఆ ట్వీట్ అటు తిరిగి ఇటు తిరిగి భారత్ లో తలైవా ఫ్యాన్స్ ను చేరింది. ఇంకేముంది, మన తలైవా రజనీకాంత్ మేనియా ఆస్ట్రేలియా వరకు పాకిపోయిందని మురిసిపోయారు వీరాభిమానులు. ప్రస్తుతం ఈ ట్వీట్ ను లైక్, రీట్వీట్ చేస్తున్నవారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారట.