Jammu And Kashmir: సరిహద్దుల్లో 150 యుద్ధ విమానాలను మోహరించిన భారత్... ఉగ్రవాదులను వెనక్కి రప్పిస్తున్న పాక్!
- సరిహద్దుల్లో సత్తాను చాటుతున్న వాయుసేన విమానాలు
- మోహరించిన జాగ్వార్, మిరాజ్ ఫైటర్ జెట్లు
- సరిహద్దులను ఖాళీ చేస్తున్న పాకిస్థాన్
జమ్ము కాశ్మీర్ లోని అవంతిపురాలో సైనికుల కాన్వాయ్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడిన తరువాత, అవసరమైతే శత్రు దేశంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపుతూ, సరిహద్దుల్లో 150 యుద్ధ విమానాలను భారత్ మోహరించింది. ఇటీవలే సరిహద్దుల్లో వాయుసేన సత్తాను చాటేలా విన్యాసాలు చేయాలని నిర్ణయించిన భారత్, జాగ్వార్ ఫైటర్ విమానాలు, మిరాజ్ 2000 విమానాలను, మల్టీ రోల్ జెట్స్ ను ఇక్కడికి పంపింది. విన్యాసాల కోసం మోహరించిన ఈ ఫైటర్ విమానాలతోనే ఇపుడు పాక్ పై చర్యలు తీసుకోవడానికి సైన్యం సన్నాహాలు చేస్తోంది.
ఇదిలావుండగా, జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న పాకిస్థాన్ కశ్మీర్ లో ఉన్న టెర్రరిస్టులను వెనక్కి రప్పిస్తోంది. ఇప్పటికే పలు ఉగ్రవాద శిబిరాలను మూసివేయించిన పాక్, భారత్ యుద్ధానికి దిగితే, గట్టిగా బదులివ్వాలన్న ప్రయత్నాల్లో ఉంది. ప్రతీకార దాడులు చేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో, ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరగవచ్చన్న ఆలోచనతో పాక్ సరిహద్దులను ఖాళీ చేస్తున్నట్టు సమాచారం.