Ashok Gajapatiraju: చంద్రబాబుకు భారీ షాక్... రాజీనామా దిశగా అశోక్ గజపతిరాజు?
- 1983 నుంచి టీడీపీలో ఉన్న అశోక్ గజపతిరాజు
- ఇటీవలే బీజేపీలో చేరిన ఆనంద గజపతిరాజు కుమార్తె
- టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేంద్ర మాజీ మంత్రి
- పార్టీ మారనున్నారని టీడీపీలో చర్చలు
కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఆ పార్టీని వీడనున్నారు. తెలుగు మీడియాలోని కొన్ని పేపర్లు, చానెళ్లలో వస్తున్న కథనాలు, వార్తల ప్రకారం, ఆయన త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లలో ఒకరైన కిశోర్ చంద్రదేవ్ ను టీడీపీలోకి చేర్చుకోవడం, ఆయన చేరికపై తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే అశోక్ గజపతిరాజు తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారని కూడా సమాచారం.
కాగా, 1983 నుంచి టీడీపీలో ఉన్న అశోక్ గజపతిరాజు, వాస్తవానికి చంద్రబాబు కన్నా పార్టీలో సీనియర్ నేత. నిన్న జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి ఆయన హాజరు కాలేదు. ఇటీవలి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం శంకుస్థాపనకూ ఆయన గైర్హాజరయ్యారు. పార్టీలో జరుగుతున్న కొన్ని కార్యకలాపాలు తమ నేతకు ఏ మాత్రం నచ్చడం లేదని ఆయన అనుచరులు అంటున్నారు. సీఎం చంద్రబాబు, తనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆలోచనలో ఆయన ఉన్నారని చెబుతున్నారు.
ఇదిలావుండగా, అశోక్ గజపతిరాజు టీడీపీని వీడితే మరో పార్టీలో చేరుతారా? లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా? అన్న విషయమై ఎటువంటి కథనాలూ రావడం లేదు. ఆయన కుమార్తె, విజయనగరం ప్రాంతంలో గత రెండు మూడేళ్లుగా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో భాగమైన అదితి గజపతిరాజు రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ఇటీవలి కాలంలో మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కొంతకాలం క్రితం అశోక్ గజపతిరాజు సోదరుడు, మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత, భారతీయ జనతా పార్టీలో చేరి కలకలాన్నే రేపారు. అప్పట్లో ఈ విషయమై స్పందించిన అశోక్ గజపతిరాజు, సంచిత బీజేపీతో చేరడం వెనుక తన ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు సంచిత విషయమై అశోక్ గజపతిరాజుపై విమర్శల వర్షం కురిపించారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో కొనసాగుతారా? లేక బీజేపీ లేదా మరో పార్టీలో చేరుతారా? అన్న చర్చ తెలుగుదేశం వర్గాల్లో కొనసాగుతోంది. ఆయన మాత్రం తాను టీడీపీకి విధేయుడినేనని, పార్టీని వీడే ఆలోచన లేదని నిన్న తనను కలిసిన మీడియాతో వ్యాఖ్యానించారు.