Andhra Pradesh: వైసీపీ వైపు కావూరి సాంబశివరావు చూపు.. రంగంలోకి దిగిన విజయసాయిరెడ్డి!
- కావూరితో సమావేశమై చర్చలు
- ఏలూరు లోక్ సభ కోరిన నేత
- 2-3 రోజుల్లో వైసీపీలో చేరే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ వంటి కాపు నేతలు వైసీపీలో చేరగా, టీడీపీ నుంచి వైసీపీలోకి ఇతర కులాల నుంచి కూడా మరిన్ని వలసలు ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు కూడా వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న కావూరి బీజేపీలో చేరారు.
తాజాగా వైసీపీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కావూరితో భేటీ అయ్యారు. కాగా, ఈ సమావేశంలో ఏలూరు లోక్ సభ స్థానాన్ని తనకు ఇవ్వాల్సిందిగా కావూరి కోరినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో 2-3 రోజుల్లో కావూరి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఈసారి గణనీయమైన లబ్ధి చేకూరనుంది.