Andhra Pradesh: నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తాం: వైఎస్ జగన్
- నామినేషన్ పనుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేస్తాం
- పేదోడు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.7 లక్షలు ఇస్తాం
- బీసీ డిక్లరేషన్ ని ప్రకటించిన జగన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే కనుక నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఏలూరులో జరిగిన ‘బీసీ గర్జన’ సభలో బీసీ డిక్లరేషన్ ని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని అన్నారు.
అంతేకాకుండా, నామినేషన్ పనుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. షాపులున్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ఉచితంగా ఏడాదికి రూ.10 వేలు అందజేస్తామని, ప్రధాన ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం కల్పిస్తామని, ఆ ఆలయాల్లో బోర్డు మెంబర్లుగా నాయీ బ్రాహ్మణులు, యాదవులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సంచార జాతులకు ఉచితంగా ఇల్లు, ఉపాధి అవకాశం కల్పిస్తామని, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల కోసం.. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ఇస్తామని, ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా కింద ఇస్తామని, మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ పై సబ్సిడీ పెంచుతామని హామీ ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత మహిళకు ప్రతి నెలా రూ.2 వేలు ఇస్తామని, పేదవాడు ప్రమాదవ శాత్తు చనిపోతే కనుక బీమా కింద రూ.7 లక్షలు అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ఏపీలోని 31 బీసీ కులాలు కేంద్రం పరిధిలోని ఓబీసీ జాబితాలో లేవని, ఈ విషయమై కేంద్రానికి చంద్రబాబు ఒక్క లేఖ కూడా రాయలేదని జగన్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని, చిరు వ్యాపారులకు గుర్తింపుకార్డులు అందజేస్తామని, రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు.