TTD: టీటీడీ సభ్యులుగా కొత్తగా ఇద్దరి నియామకం!
- టీటీడీ కార్యవర్గంలో ఇద్దరికి చోటు
- సండ్ర, అనితల స్థానాలు కొత్తవాళ్లతో భర్తీ
- రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. వేనాటి రామచంద్రారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబులకు టీటీడీ పాలకమండలి సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆదివారం నియామక ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకుముందు, పాయకరావు పేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితను టీటీడీ బోర్డు మెంబర్ గా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే అనిత సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటి తన ఉత్తర్వులను రద్దు చేసుకుంది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కూడా టీటీడీ పాలకమండలిగా సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో ఆయన నియామకం కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో, కొత్తగా నెల్లూరు జిల్లాకు చెందిన వేనాటి రామచంద్రారెడ్డి, కడప జిల్లా రాయచోటి వాసి సుగవాసి ప్రసాద్ బాబులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఏపీ ప్రభుత్వం.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతో పట్టున్న వేనాటి గతంలో నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ పదవిని ఆశించి భంగపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో ఆయనను సంతృప్తి పరిచేందుకు టీటీడీ పాలకమండలిలో చాన్స్ ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఇక, రాయచోటి ప్రాంతానికి చెందిన సుగవాసి ప్రసాద్ బాబు ఏపీ మంత్రి నారా లోకేష్ కు సన్నిహితుడని ప్రచారంలో ఉంది. అయితే రాయచోటి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ప్రసాద్ బాబుకు రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చంద్రబాబు నుంచి ఇప్పటికే హామీ అందిందని, ఈ కారణంగానే ప్రసాద్ బాబును బుజ్జగించేందుకు టీటీడీ సభ్యుడిగా నియమించారని రాజకీయ వర్గాలంటున్నాయి.