Cricket: పుల్వామా అమర జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ విరాళం రూ.5 కోట్లు!
- అనుమతి కోసం లేఖ రాసిన బీసీసీఐ చీఫ్
- బాధిత కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యం
- ఐపీఎల్ ఫ్రాంచైజీలు స్పందించాలంటూ పిలుపు
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతీపుర వద్ద గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ముందుకొచ్చింది. కనీసం రూ.5 కోట్లకు తగ్గకుండా విరాళం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆర్థికపరమైన అధికారాలు తమ చేతిలో లేకపోవడంతో సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ కి బీసీసీఐ తాత్కాలిక ఛీఫ్ సీకే ఖన్నా లేఖ రాశారు. ప్రభుత్వ సంస్థల ద్వారా తమ విరాళాన్ని బాధితులకు అందేలా చూస్తామని ఖన్నా తెలిపారు.
బీసీసీఐ మాత్రమే కాకుండా, అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం కోసం పాటుపడే జవాన్లకు చేయూతగా నిలిచే తరుణం ఇదేనని అన్నారు. బీసీసీఐ మాత్రమే కాదు ఇతర క్రీడాకారులు కూడా సీఆర్పీఎఫ్ అమరవీరుల కుటుంబాల పట్ల ఔదార్యం చూపిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ బాధిత కుటుంబాల్లో ఉన్న పిల్లలను చదివించేందుకు ముందుకు రాగా, విదర్భ రంజీ జట్టు తాము లేటెస్ట్ గా గెలిచిన ఇరానీ ట్రోఫీ ప్రైజ్ మనీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. మరోవైపు, హర్యానా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఆఫీసర్ ర్యాంక్ లో ఉన్న స్టార్ బాక్సర్ విజేందర్ కూడా బాధితుల కోసం తన నెల జీతాన్ని విరాళంగా అందించాడు.