India: పాకిస్థాన్ పై దాడి చేయమంటున్న పాక్ వేర్పాటు వాద సంస్థ బీఎన్సీ
- భారత్ కు బలూచిస్థాన్ నేషనల్ కాంగ్రెస్ విజ్ఞప్తి
- పాక్ తో సంబంధాలను తెంచుకోండి
- భారత్ లోని పాక్ హైకమిషనర్ ను బహిష్కరించండి
పాకిస్థాన్ పై ప్రతీకార దాడి చేయమంటూ భారత్ కు పాక్ వేర్పాటు వాద సంస్థ బలూచిస్థాన్ నేషనల్ కాంగ్రెస్ (బీఎన్సీ) విజ్ఞప్తి చేసింది. పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిని బీఎన్సీ ఖండించింది. పాక్ ప్రభుత్వంతో మోదీ సర్కార్ అన్ని సంబంధాలు తెంచుకోవాలని సూచించింది. భారత్ లోని పాక్ హైకమిషనర్ ను బహిష్కరించడంతో పాటు పాక్ లో ఉన్న భారత హైకమిషనర్ ను వెనక్కి పిలిపించాలని కోరింది.
ఈ దారుణ ఘటనకు కారకులైన వారిపై యుద్ధం ప్రకటించి, న్యాయస్థానం ముందుకు తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరింది. ప్రస్తుతం ప్రవాసంలో ఉంటున్న బలూచీ నేత ఖాన్ కలాత్ నేతృత్వంలో బలూచీ ప్రభుత్వం ఏర్పాటుకు భారత్ చేయూత నివ్వాలని, బలూచిస్థాన్ పై పాక్ ఆక్రమణకు సంబంధించిన అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసేందుకు సహకరించాలని బీఎన్సీ విజ్ఞప్తి చేయడం గమనార్హం. కాగా, పాక్ లోని బలూచిస్థాన్ రాష్ట్రం తమ స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతోంది. ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్న వారిని పాక్ ప్రభుత్వం అణచివేస్తోంది. దీంతో, ఇక్కడి ప్రజలు భయపడి ఇతర దేశాలకు పారిపోతున్నారు.