Chandrababu: జగన్ లో ఎంతో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది: చంద్రబాబునాయుడు
- బీసీలందరూ టీడీపీ వెనుకే
- సబ్ ప్లాన్ కు చట్టబద్ధత ఎప్పుడో తెచ్చాం
- జయహో బీసీ సభను విజయవంతం చేశాం
- ఈ ఉదయం నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
నిన్న ఏలూరులో జరిగిన బీసీ సభలో వైఎస్ జగన్ ఎంతో ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం పార్టీ సీనియర్ నేతలు, జిల్లాల బాధ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, బడుగులు తెలుగుదేశం పార్టీకి వెన్ను దన్నుగా నిలిచి వుండటం వైసీపీకి మింగుడు పడటం లేదని విమర్శించారు.
వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అహర్నిశలూ శ్రమించేది తమ పార్టీయేనని, సబ్ ప్లాన్ కు చట్టబద్ధతను తామే కల్పించామని గుర్తు చేశారు. జగన్ బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం ఆయన అవగాహనా రాహిత్యాన్ని చెప్పకనే చెబుతోందని అన్నారు. "ఇటీవల మనం 'జయహో బీసీ' సభను విజయవంతం చేశాం. అది చూసి జగన్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళారు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జయహో బీసీ సభకు పోటీగానే నిన్నటి సభను నిర్వహించి, నోటికి వచ్చింది మాట్లాడి, హడావుడిగా ముగించారని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ అద్దె మైకు వంటి వాడని చెప్పిన చంద్రబాబు, బీజేపీ, వైసీపీలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే రానుందని అన్నారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని, అత్యుత్తమ బృందాన్ని ఏర్పాటు చేసుకుని, బరిలోకి దిగుతామని, త్వరలోనే పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తానని అన్నారు.
ఐవీఆర్ఎస్ విధానంలో పాలనపై ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నామని చెప్పిన ఆయన, తెలుగుదేశం పాలనలో కౌలు రైతులకు భరోసాను కల్పించామని అన్నారు. కాపుల సంక్షేమానికి పెద్ద పీట వేశామని, కాపు కార్పొరేషన్ కు భారీగా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. జిల్లాల్లో కాపు భవన్ లను నిర్మిస్తున్నామని, వారి పిల్లల విదేశీ విద్యకు సాయపడుతున్నామని చెప్పారు.