jayaram: జయరాం హత్య కేసులో యాభై మందిని ప్రశ్నించాం: హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ
- బ్యాంకు లావాదేవీలు, పత్రాలను పరిశీలించాం
- ఈ కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉంది
- ఈ కేసులో పోలీసుల ప్రమేయంపై రేపు విచారణ
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి నాలుగు రోజులుగా 50 మందిని ప్రశ్నించామని హైదారాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. బ్యాంకు లావాదేవీలు, సంబంధిత పత్రాలను పరిశీలించామని చెప్పారు. ఈ హత్య కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ కాకుండా మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉందని, ఎస్ ఆర్ నగర్ కు చెందిన నగేశ్, విశాల్ ను కూడా అరెస్టు చేశామని అన్నారు.
ఈ కేసులో పోలీసుల ప్రమేయం పైనా రేపు విచారణ జరుపుతామని, పోలీసు అధికారులను కచ్చితంగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఈ హత్య జరిగిన రోజు కాకుండా గతంలో అధికారులు వీరితో మాట్లాడినట్టు తమ దర్యాప్తులో తేలిందని, తనకు ఐదుగురు పోలీసు అధికారులతో పరిచయం ఉందని రాకేశ్ అంగీకరించాడని ఆయన తెలిపారు.
కాగా, జయరాం హత్యకు ముందు ఆయనతో బలవంతంగా ఖాళీ దస్తావేజులపై రాకేశ్ రెడ్డి సంతకాలు చేయించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో ద్వారా చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వీడియో చిత్రీకరణ సమయంలోనే రాకేశ్ రెడ్డికి నగేశ్, విశాల్ సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. కీలక ఆధారం కానున్న ఈ వీడియోను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.