Rakesh reddy: రాకేశ్ రెడ్డికి అసలు బ్యాంకు ఖాతానే లేదట.. బయటపడిన కట్టుకథ
- జయరాంకు రూ.4.17 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్పిన నిందితుడు
- పూర్తిగా అబద్ధమని తేల్చిన పోలీసులు
- నేడు, రేపు మరో ఐదుగురిని విచారించనున్న అధికారులు
ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్యకేసులో మరో విస్తుపోయే నిజం బయటపడింది. జయరాం హత్య కేసు ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, పూర్తిగా కట్టుకథేనని తేలింది. జయరాంకు రూ. 4.17 కోట్లను తన ఖాతా నుంచి జయరాం ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్పినదంతా పూర్తి అబద్ధమని తేలింది.
అతడికి అసలు బ్యాంకు ఖాతానే లేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఎపిసోడ్లో రాకేశ్ రెడ్డికి సహకరించిన మిగిలిన నిందితులు ఐదుగురిని నేడు, రేపు విచారించనున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులను తొలుత విచారించిన అనంతరం మిగిలిన ముగ్గురినీ విచారించనున్నారు. మరోవైపు, ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రౌడీషీటర్ నగేష్, అతడి అల్లుడు విశాల్లను నిందితుల జాబితాలో చేర్చారు.