Chandrababu: చంద్రబాబుపై కేసు పెడతానని అనలేదు: స్వరూపానందేంద్ర వివరణ
- టీటీడీలో పాలన లోపభూయిష్టంగా తయారైందంటూ తీవ్ర వ్యాఖ్యలు
- చంద్రబాబుపై కోర్టులో కేసు వేస్తానని హెచ్చరిక
- తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్న స్వామి
తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన గాడి తప్పిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసు వేస్తానని హెచ్చరించిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తాజాగా ఈ విషయంలో మీడియాకు వివరణ ఇచ్చారు. ఏపీలో అవినీతి తారస్థాయికి చేరుకుందని, ప్రభుత్వం మార్పు కోసం త్వరలో రాజశ్యామల యాగం చేయనున్నట్టు చెప్పారు.
స్వరూపానందేంద్ర స్వామి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నారని, అందుకనే ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వెనక్కి తగ్గిన స్వామి.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు.
కాకినాడ సూర్యరావుపేటలోని బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో 135 ఏళ్ల తరువాత జరుగుతున్న మహాకుంభాభిషేకానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వామి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీటీడీ భూములు అన్యాక్రాంతమయ్యాయని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. త్వరలోనే వాటిని బయటపెడతానన్న స్వామి.. చంద్రబాబునాయుడు, టీటీడీ అధికారులపై కేసు పెడతానని, కోర్టులోనూ కేసు వేస్తానని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో, వివరణ ఇస్తూ తాను చంద్రబాబుపై కేసు వేస్తానని అనలేదని, టీటీడీపై కేసు వేస్తానని మాత్రమే అన్నానని తెలిపారు.