punjab: ఉగ్రదాడికి బదులు తీర్చుకోవాల్సిందే.. 41కి ప్రతిగా 82 మందిని చంపాల్సిందే: పంజాబ్ సీఎం
- కంటికి కన్ను సిద్ధాంతాన్ని అమలు చేయాల్సిందే
- భారత్ కూడా అణ్వస్త్ర దేశమేనన్న సంగతిని గుర్తుంచుకోవాలి
- సైనికుల ప్రాణాలు జోక్ కాదు
పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకోవాల్సిందేనని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని, 41 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలకు బదులుగా 82 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను హతమార్చాల్సిందేనని తేల్చి చెప్పారు. పాక్ చర్యలతో ఇప్పటికే చాలా విసిగిపోయామని, ఇప్పటి వరకు జరిగింది చాలన్న సీఎం.. కంటికి కన్ను.. పంటికి పన్ను లెక్క సరిచేయాల్సిందేనని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని అయితే, సైనికుల ప్రాణాలు జోక్ కాదని పేర్కొన్నారు. పాక్‌తో మిలటరీ పరంగా, దౌత్యపరంగా, ఆర్థికంగా.. వీలైతే మూడూ పద్ధతుల్లోనూ యుద్ధం చేయాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏదో ఒకటి చేయాల్సిందేనని, పాక్ చర్యలతో దేశం మొత్తం విసిగిపోయిందని అన్నారు.
పాక్‌తో శాంతి చర్చలకు ఇకపై ఎంతమాత్రమూ ఆస్కారం లేదన్న అమరీందర్.. దేశం మొత్తం ఆగ్రహంతో రగిలిపోతోందన్నారు. ఇక మాటలు వద్దని, చేతల ద్వారానే పాక్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. కేవలం తమది అణ్వస్త్ర దేశమన్న ఒకే ఒక్క కారణంతో భారత్‌ను పాక్ అడ్డుకోలేదని, భారత్ కూడా అణ్వస్త్ర దేశమేనన్న సంగతిని గుర్తెరిగితే మంచిదని హెచ్చరించారు. 1999లో కార్గిల్ యుద్ధంలో ఏ జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి హితవు పలికారు.