Telangana: పోర్ట్ ఫోలియోలు కూడా ఖరారయ్యాయట... తెలంగాణలో ఏ శాఖకు ఎవరు మంత్రంటే..!
- నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ
- కొప్పుల ఈశ్వర్ కు విద్యా శాఖ
- మల్లారెడ్డికి విద్యుత్ శాఖ
నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగనుండగా, ఇప్పటికే మంత్రిగా ఉన్న మహమూద్ అలీకి తోడుగా, మరో 10 మంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి పేర్లపై ఇప్పటికే ఓ స్పష్టత రాగా, ప్రస్తుతం వారికి కేటాయించనున్న శాఖలపైనా లీకులు వస్తున్నాయి. నిరంజన్ రెడ్డికి కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ రెడ్డికి పరిశ్రమల శాఖను, కొప్పుల ఈశ్వర్ కు విద్యాశాఖను, ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యవసాయ శాఖను, జగదీశ్వర్ రెడ్డికి రోడ్లు, భవనాల శాఖను, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పౌర సరఫరాల శాఖను, ఇంద్రకరణ్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను, మల్లారెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
కాగా, మంత్రివర్గ కూర్పుపై విపక్షాలు మండిపడుతున్నాయి. గత మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదని, ఇప్పుడు కూడా మహిళకు స్థానం లేకుండా కేసీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇక, ఈ పది మంది చేరికతో క్యాబినెట్ సంఖ్య 12కు చేరనుండగా, తెలంగాణలోని ఎమ్మెల్యే సీట్ల లెక్క ప్రకారం మరో ఆరుగురికి మంత్రులయ్యే చాన్స్ ఉంటుంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల్లో ఐదుగురు రెడ్డి, ముగ్గురు బీసీ, ఒక వెలమ, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. వీరిలో నలుగురు గతంలోనూ కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉండగా, ఆరుగురు కొత్త ముఖాలు.