Andhra Pradesh: పోటీ నుంచి తప్పుకుంటానన్న టీడీపీ నేత తోట నర్సింహం.. జగ్గంపేటపై కన్ను!
- తనకు బదులుగా భార్యకు ఛాన్సివ్వాలని విన్నపం
- ఈరోజు కుటుంబంతో కలిసి చంద్రబాబుతో భేటీ
- జగ్గంపేట నుంచి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం
ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో టికెట్ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ పార్లమెంటు సభ్యుడు తోట నర్సింహం నిర్ణయించారు. అనారోగ్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తనకు బదులుగా తన భార్య వాణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందిగా నర్సింహం టీడీపీ అధినేతను కోరనున్నట్లు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో తోట నర్సింహం తన కుటుంబ సభ్యులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు మధ్యాహ్నం కలుసుకోనున్నారు. తమ డిమాండ్లను పార్టీ అధినేత ముందు ఉంచనున్నారు. కాగా, జగ్గంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.