Harish Rao: తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై స్పందించిన హరీశ్ రావు!
- కొత్తగా పది మందిని తీసుకున్న కేసీఆర్
- నేను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను
- కేసీఆర్ ఏం చెబితే అది చేయడమే నా పని
- అసంతృప్తిగా లేదన్న హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తన క్యాబినెట్ ను నేడు విస్తరిస్తూ, కొత్తగా పది మందిని మంత్రివర్గంలోకి తీసుకున్న వేళ, ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబడిన వారందరికీ తన అభినందనలు తెలిపారు.
తనకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై స్పందిస్తూ, "నేను ఎన్నికలకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిలాంటి కార్యకర్తను. కేసీఆర్ ఏది ఆదేశిస్తే, దాన్ని తు.చ తప్పకుండా పాటిస్తాను. ముఖ్యమంత్రిగారు ఆయా ప్రాంతాలు, సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్ ను ఏర్పాటు చేశారు. ఆయన నాకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తాను. నాకు ఎలాంటి అసంతృప్తీ లేదు. నా పేరిట వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నాను" అన్నారు.
తన పేరిట ఎటువంటి సోషల్ మీడియా గ్రూప్ లు లేవని, ఒకవేళ ఎవరైనా అలా క్రియేట్ చేసుంటే, వాటిని తొలగించాలని కోరారు. ఎవరైనా కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేయాల్సిందేనని అన్నారు.