India: పాక్ నుంచి ఇండియాలోకి వస్తే ప్రాణాలతో తిరిగివెళ్లరు.. కాల్చిపారేస్తాం!: ఉగ్రవాదులకు ఆర్మీ గట్టి వార్నింగ్
- యువకులకు కుటుంబ సభ్యులు నచ్చజెప్పాలి
- లొంగిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు
- శ్రీనగర్ లో ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్త మీడియా సమావేశం
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సైన్యం ఈ దాడి వెనుకున్న ఉగ్రవాదులను వేటాడి చంపింది. తాజాగా ఈరోజు శ్రీనగర్ లో ఆర్మీ, సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారి కన్వాల్ జీత్సింగ్ థిల్లాన్ ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించారు.
కశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదులు వెంటనే లొంగిపోవాలనీ, చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ప్రతీఒక్కరినీ అంతం చేస్తామని స్పష్టం చేశారు. పుల్వామా దాడి వెనుకున్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ జాడే లేకుండా చేస్తామని తేల్చిచెప్పారు. పుల్వామా ఘటనకు పాల్పడిన జైషే సంస్థకు పాకిస్తాన్ సహకారం ఉందని స్పష్టం చేశారు. తుపాకులు వదిలేయాల్సిందిగా కశ్మీరీ యువకులకు కుటుంబ సభ్యులు నచ్చజెప్పాలని థిల్లాన్ విజ్ఞప్తి చేశారు.
లేదంటే వారిని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లొంగిపోవాలని అనుకునే యువకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు ఎవరూ ప్రాణాలతో తిరిగివెళ్లారనీ, అందరినీ అంతం చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.