Pakistan: పుల్వామా దాడి వెనుక మోదీ రాజకీయ లబ్ధి: అనుమానం పెరుగుతోందన్న చంద్రబాబు
- దాడితో సంబంధం లేదంటున్న పాకిస్థాన్
- అదే విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు విమర్శలు
- దేశాన్ని భ్రష్టు పట్టిస్తే ఊరుకోబోమని నిప్పులు
పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడితో తమకు సంబంధం లేదని పాకిస్థాన్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, అదే విషయాన్ని ప్రస్తావించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ ఉదయం సంచలన విమర్శలు చేశారు. ఈ దాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ లబ్ధి కోణం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయని అన్నారు. టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం దేశాన్ని ఇష్టమొచ్చినట్టు వాడుకుంటామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. దేశాన్ని భ్రష్టు పట్టించే చర్యలను అడ్డుకుని తీరాలన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ పార్టీ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉందన్న ఆయన, నేరాలు, వాటి ద్వారా కలిగే లాభం మాత్రమే ఇప్పుడు వైకాపాకు దొరికిన రాజకీయమని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తును ప్రస్తావిస్తూ, బీజేపీ చేతిలో అన్నాడీఎంకే ఓ రిమోట్ కంట్రోల్ లా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న యాత్రలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ విషయంలో టీడీపీకి పూర్తి స్పష్టత ఉందని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని, అది కేంద్ర స్థాయిలోనే ఉంటుందని చెప్పారు.
కృష్ణా జిల్లాలో పార్టీలో విభేదాలపై స్పందిస్తూ, తాను స్వయంగా జిల్లా నేతలతో మాట్లాడానని, చాలావరకూ గొడవలు లేకుండా ఎవరెవరి పరిధిలో వారు పనులు చేసుకుంటున్నారని, చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నా, అవి రచ్చకెక్కేంతగా ఏమీ లేవని అన్నారు.