112: అత్యవసర సమయంలో మన నేస్తం.. 112 నెంబర్ వచ్చేసింది!
- అన్ని రకాల హెల్ప్ లైన్ నంబర్లూ విలీనం
- సరికొత్త ఈఆర్ఎస్ఎస్ వ్యవస్థ అందుబాటులోకి
- 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా
ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో అన్ని రకాల హెల్ప్ లైన్ నంబర్లనూ కలిపి, సరికొత్త ఈఆర్ఎస్ఎస్ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్) నంబర్ 112 అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త యునీక్ నంబర్ కు ఏదైనా ఆపత్కాల సమయంలో ఫోన్ చేస్తే, తక్షణ సాయం అందుతుంది. సీ-డీఏసీ (సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్) ఈ హెల్ప్ లైన్ నంబర్ టెక్నాలజీని డిజైన్ చేయగా, ఇప్పుడది అమెరికాలో 911 మాదిరిగా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది.
ఈ నంబర్ ను గత సంవత్సరం హిమాచల్ ప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా లాంచ్ చేసిన కేంద్రం, దీని అమలును పరీక్షించి సంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ నంబర్ అందుబాటులోకి వచ్చేసింది. పోలీస్, ఫైర్ డిపార్ట్ మెంట్, అంబులెన్స్ తదితర హెల్ప్ లైన్ నంబర్లన్నీ దీనికి కనెక్ట్ అయి ఉంటాయి.
ఇక ఈఆర్ఎస్ఎస్ విధానం ఎంతో అత్యాధునికమైంది. ఈ సిస్టమ్ కు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, ఈఆర్ఎస్ఎస్ వెబ్ సైట్, ప్యానిక్ బటన్ వంటి అన్ని ఎమర్జెన్సీ సిగ్నల్స్ ను సులువుగా అందుకుంటుంది. టెలికం సర్వీసు ప్రొవైడర్స్ అందించే లొకేషన్ ఆధారిత సేవల ఆధారంగా ఇది పని చేస్తుంది. ఎక్కడి నుంచి ఫోన్ వస్తోందన్న విషయాన్ని కచ్చితంగా విశ్లేషించగలుగుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వెంటనే కావాల్సిన సాయం అందుతుందని భరోసాను ఇస్తున్నారు.