suicide bomber: మా సైనికులను చంపిన సూసైడ్ బాంబర్ పాకిస్థాన్ వాడే: ఇరాన్
- గతవారం ఇరాన్ సైనికులపై ఆత్మాహుతి దాడి
- పాక్ జాతీయులు నేరుగా ఈ దాడిలో పాల్గొన్నారని ఇరాన్ ఆరోపణ
- దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నఇరాన్
ఆత్మాహుతి దాడికి పాల్పడి 27 మంది ఇరాన్ సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది పాకిస్థాన్ వాడేనని ఆ దేశం ఆరోపించింది. ఇరాన్-పాకిస్థాన్ సరిహద్దులో గత వారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డులు పెద్దఎత్తున మృతి చెందారు. సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఈ దాడిలో 27 మంది సైనికులు మృతి చెందారు.
ఈ ఘటనను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. తమ సైనికులపై దాడికి పాల్పడింది పాక్ జాతీయుడేనని పేర్కొంది. అంతేకాదు, దాడికి పథక రచన చేసింది కూడా పాకిస్థాన్ జాతీయుడేనని ఇరాన్ గార్డ్స్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ పాక్‌పౌర్ పేర్కొన్నారు. తమ సరిహద్దులో జరుగుతున్న ఉగ్రదాడులు పాక్ పనేనని తరచూ ఆరోపిస్తున్న ఇరాన్ ఈసారి స్వరం పెంచింది. తాజా ఉగ్రదాడి పాకిస్థానీయుల పనేనని తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. ఈ దాడిలో వారు నేరుగా పాల్గొన్నారని ఆరోపించింది.