KCR: కీలకమైన శాఖలన్నీ తనవద్దే అట్టిపెట్టుకున్న కేసీఆర్!
- ఎవరికీ అప్పగించని శాఖలన్నీ కేసీఆర్ వద్దే
- ఆర్థిక, రెవెన్యూ, ఐటీ, మునిసిపల్, నీటి పారుదల శాఖలు
- మలివిడత విస్తరణలో ఈ శాఖల పంపిణీ
నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, కీలకమైన శాఖలన్నీ తనవద్దే ఉంచుకున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులన్నీ కలగలిపివుండే నీటి పారుదల, రాష్ట్ర ఆదాయ, వ్యయాల లెక్కలను తేల్చే రెవెన్యూ శాఖలతో పాటు విద్యుత్ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్నారు.
ఇతర మంత్రులకు కేటాయించని పురపాలక, పరిశ్రమలు, ఐటీ, స్త్రీ శిశు సంక్షేమం, సినిమాటోగ్రఫీ తదితర శాఖలను కూడా కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. తన మంత్రిమండలిలో మరో ఆరుగురు మంత్రులకు చాన్స్ ఉండటం, ఇంకా హరీశ్ రావు, కేటీఆర్ వంటి కీలక నేతలను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో, వారి కోసమే ముఖ్యమైన శాఖలను కేసీఆర్ తనవద్దే అట్టి పెట్టుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. లోక్ సభ ఎన్నికల తరువాతే మలివిడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.