Hyderabad: ప్రయాణికురాలిపై దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ అనుచిత ప్రవర్తన... చితగ్గొట్టి కాళ్లు పట్టించిన బంధువులు!
- స్టేజ్ లో ఆపకుండా వెళ్లిన డ్రైవర్
- బస్సును చేజ్ చేసి పట్టుకున్న యువతి
- యువతిపై చెయ్యి చేసుకున్న డ్రైవర్
ఎక్కించుకోవాల్సిన స్టేజ్ లో ప్రయాణికురాలిని ఎక్కించుకోకుండా వెళ్లిపోయి, ఆపై ఆమెను ఇబ్బందులకు గురిచేసి, చివరకు ఎలాగోలా బస్సును పట్టుకున్న ఆమెపై రాయలేని విధంగా తిట్టి, చెయ్యి చేసుకున్నందుకు దివాకర్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ కు ఆమె బంధువులు దేహశుద్ధి చేసి, ఆమెకు క్షమాపణ చెప్పించారు.
బాధితురాలు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉప్పలపాడు లత అనే యువతి, అభీబస్ ద్వారా దివాకర్ ట్రావెల్స్ బస్సులో విజయవాడకు టికెట్ బుక్ చేసుకుంది. నిన్న బస్సు కోసం కొండాపూర్ లో వేచి చూస్తుంటే, బస్సు అక్కడికి రాకుండానే వెళ్లిపోయినట్టు తెలిసింది. దాంతో బస్సును అందుకునేందుకు తన మిత్రుడి కారులో గచ్చిబౌలి వెళ్లగా, అక్కడి నుంచి కూడా బస్ వెళ్లిపోయింది. అభీబస్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా, వారు డ్రైవర్ తో మాట్లాడించారు. బస్సు టోలీచౌక్ దాటిందని, మెహదీపట్నం రావాలని డ్రైవర్ చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్లింది. అక్కడా బస్సు ఆపకపోవడంతో, తన మిత్రుడి కారులోనే దాన్ని చేజ్ చేసి చివరికి లకడీకా పూల్ సమీపంలో బస్సుకి కారును అడ్డంగా పెట్టి ఆపారు.
ఆపై బస్సును ఎందుకు ఆపారంటూ, దుర్భాషకు దిగిన డ్రైవర్, ఆమె బస్సు ఎక్కిన తరువాత కూడా ఇంకా బూతులు తిట్టడంతో ఆమె అతనిపై చేయి చేసుకుంది. దాంతో అతను కూడా ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. ఈ ఘటనను మిగతా ప్రయాణికులు వీడియో తీశారు. బస్సు వెళుతున్నంత సేపూ డ్రైవర్ తిట్లు సాగుతూనే ఉండగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ పోలీసులు, విషయాన్ని సూర్యాపేట పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఆమెను సంప్రదించి, బస్సును మధ్యలో ఆపితే ప్రయాణికులు ఇబ్బంది పడతారని, కాబట్టి విజయవాడ వెళ్లాక అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈలోగా, ఆమె డ్రైవర్ ప్రవర్తనకు సంబంధించి ఇతర ప్రయాణికులు తీసిన వీడియోను తన తల్లిదండ్రులకు పంపి, విషయం చెప్పింది. దీంతో ఆమె బంధువులంతా గవర్నర్ పేటకు చేరుకుని మమతా హోటల్ సమీపంలో బస్సు ఆగగానే, ఒక్కఉదుటున డ్రైవర్ మీద పడి, అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం లత కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పించి, ఇకపై ప్రయాణికులతో అలా వ్యవహరించనని డ్రైవర్ తో చెప్పించి వదిలారు.