chitturu nagayya: చిత్తూరు నాగయ్యగారి ఆస్తులన్నీ అలా కరిగిపోయాయి: సీనియర్ నటుడు రావి కొండలరావు
- అప్పట్లో నాగయ్యకి ఎంతో ఆస్తి వుండేది
- దానధర్మాలు బాగా చేసేవారు
- నిర్మాతగా నష్టపోయారు
తెలుగు తెరపై నటనకు అసలు సిసలైన నిర్వచనం చెప్పిన అలనాటి నటుల్లో చిత్తూరు నాగయ్య ఒకరు. అప్పట్లో ఆయన పోషించిన ఆణిముత్యాల్లాంటి కొన్ని పాత్రలను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి చిత్తూరు నాగయ్య గురించి, ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రావి కొండలరావు ప్రస్తావించారు.
"నేను మద్రాస్ వెళ్లిన కొత్తలో ఏ వీధిలోకి వెళ్లినా ఫలానా ఇల్లు చిత్తూరు నాగయ్య గారిది .. ఫలానా వాళ్లు అందులో అద్దెకి వుంటున్నారు అని చెప్పేవారు. ఆయనకి అక్కడ అన్ని ఇళ్లు ఉండేవి. అప్పట్లో వాహిని స్టూడియో దగ్గర్లో ఒకపెద్ద తోట ఉండేది. అది కూడా ఆయనదే .. 'నాగయ్య గారి తోట' అని అంతా చెప్పుకునేవారు. అలాంటి నాగయ్య గారు చివరికి వచ్చేసరికి అన్నీ పోగొట్టుకున్నారు. ఎవరిని పడితే వాళ్లని నమ్మేసి డబ్బులు ఇచ్చేసేవారు .. విపరీతంగా దానధర్మాలు చేసేవారు. ఆయన ఆఫీసులో అన్నదానం మాదిరిగా నిరంతరం వడ్డన జరుగుతూనే ఉండేది. సొంతంగా తీసిన సినిమాలు దెబ్బతినడం వలన కూడా ఆయన ఆస్తులన్నీ కరిగిపోయాయి" అని చెప్పుకొచ్చారు.